-పేదరోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యం
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి (ఎఫ్ఏసి)గా డాక్టర్ జి.జగదీష్ బాధ్యతల స్వీకరణ
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) సంచాలకులు మరియు ఉపకులపతి(ఎఫ్ఏసి)గా డాక్టర్ జి.జగదీష్ గారు గురువారం ఉదయం పాత డైరెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జ్ డైరెక్టర్ డా॥ అలోక్ సచన్ గారి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్విమ్స్ లోని ఎన్టీఆర్ సర్కిల్లో శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
డా॥ జగదీష్ గారు బాధ్యతల స్వీకరణ అనంతరం తిరుమలలోని ఛైర్మన్ కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ మరియు స్విమ్స్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ బిఆర్.నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి తన జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు.
స్విమ్స్ లోని తన కార్యాలయంలో డా॥ జగదీష్ గారు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్తామని తెలిపారు. స్విమ్స్ డాక్టర్ల బృందంతో సమన్వయం చేసుకుని పేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో బర్డ్ హాస్పిటల్‌తో పాటు స్విమ్స్ హాస్పిటల్‌ను రాష్ట్రంలోనే ప్రముఖ ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఎలాంటి వ్యాధులనైనా నయం చేసేలా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతామన్నారు. తిరుపతికి 50 కి.మి పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరిగిన అంబులెన్సుల ద్వారా స్విమ్స్‌కు తీసుకొచ్చి తక్షణం అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మరో ఆరు నెలల్లో శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుందని, ఈ భవనం పై అంతస్థులో ఎయిర్ అంబులెన్సు సౌకర్యం వుంటుందని చెప్పారు. స్విమ్స్‌లో అత్యవసరసేవల విభాగాన్ని మరింత విస్తరింపజేస్తామని, బ్లడ్ సెంటర్ సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.
తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టి.టి.డి. చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు గారికి, ఇ.ఓ. శ్రీ ముద్దాడ రవిచంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ వైద్యులు, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.











