శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం నందు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగినది.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా. గుడారు జగదీష్ గారు పాల్గొని మాట్లాడుతూ... భారత హాకీ క్రీడకు మేజర్ ధ్యాన్‌చంద్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతిని తీసుకువచ్చారని అన్నారు. ఆయన క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రస్తుత సంవత్సర జాతీయ క్రీడా దినోత్సవం యొక్క Ek Ghanta, Khel Ke Maidan Mein (ఒక గంట ఆట మైదానంలో) అనే థీమ్‌ను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయాన్ని క్రీడలు, వ్యాయామం లేదా ఇతర శారీరక కార్యకలాపాలకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం, స్నేహభావం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది తమ విధులతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా. గుడారు జగదీష్ గారు విజేతలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ క్రీడా పోటీలు స్విమ్స్ విశ్వవిద్యాలయంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని, క్రీడాస్ఫూర్తిని మరియు ఐక్యతను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడ్డాయని స్విమ్స్ స్పోర్ట్స్ బోర్డు సభ్యులు తెలిపారు.


