తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 15.09.2026 నుండి 23.09.2026 వరకు జరుగుతున్న సందర్భంగా, కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆధ్వర్యంలో అలిపిరి మరియు శ్రీవారిమెట్టు వద్ద ఫస్ట్ ఎయిడ్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కేంద్రాలను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా. గుడారు జగదీష్ మంగళవారం సందర్శించి, అక్కడ భక్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య సిబ్బంది, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బందితో మాట్లాడి, భక్తులకు అందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులు, అత్యవసర వైద్య పరికరాలు తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా డా. గుడారు జగదీష్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగే సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారని, ముఖ్యంగా కాలినడకన వచ్చే భక్తులకు మార్గమధ్యంలో తక్షణ వైద్య సహాయం అందించడం ఎంతో అవసరమని అన్నారు.
ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్విమ్స్ ఆసుపత్రి నుంచి వైద్యులు, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బందిని అలిపిరి, శ్రీవారిమెట్టు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలకు డెప్యుటేషన్పై పంపుతున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా 15.09.2026 నుంచి 23.09.2026 వరకు తొమ్మిది రోజుల పాటు రెండు షిఫ్టుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని వివరించారు.
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చిన్నపాటి గాయాలు, నీరసం, తలనొప్పి, కాళ్ల నొప్పులు, బీపీ వంటి సాధారణ సమస్యలకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో పరిస్థితిని బట్టి తదుపరి వైద్య చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
“భక్తులకు వైద్యం అందించడం కేవలం వైద్య సేవ మాత్రమే కాదు.. శ్రీవారి భక్తుల పట్ల మన బాధ్యత. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు స్విమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని డా. గుడారు జగదీష్ పేర్కొన్నారు.
అలాగే, బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఆయన సూచించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వచ్చే భక్తులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను వినియోగించుకోవాలని స్విమ్స్ అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా సంబంధిత వైద్యులు, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
స్విమ్స్ ఏర్పాటు చేసిన అలిపిరి మరియు శ్రీవారిమెట్టు వైద్య శిభిరాల నందు ఈ రోజు 198 మంది భక్తులు వైద్య సేవలు పొందారని తెలిపారు.





