క్యాన్సర్ రోగులకు నిపుణుల వైద్య సేవలు – పీజీ విద్యార్థులకు ప్రత్యేక బోధన, మార్గదర్శకత్వం
“ప్రముఖ వైద్య నిపుణుల సేవలను నిరుపేద రోగులకు చేరువ చేయడమే శ్రీవారి వైద్యసేవ లక్ష్యం” – స్విమ్స్ సంచాలకులు & ఉపకులపతి డా॥ గుడారు జగదీష్
తిరుపతి, ఆగస్టు 31:
తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “శ్రీవారి వైద్యసేవ” కార్యక్రమంలో భాగంగా, శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), తిరుపతి రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా॥ కిరణ్ కుమార్ విజిటింగ్ ఫ్యాకల్టీగా ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ గుడారు జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లోని కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతిగా సేవలందిస్తున్న డా॥ కిరణ్ కుమార్, 31.08.2026 నుండి 02.09.2026 వరకు స్విమ్స్‌లో అందుబాటులో ఉండి క్యాన్సర్ రోగులకు ఉచితంగా నిపుణుల వైద్య సేవలు, చికిత్సాపరమైన సలహాలు అందించనున్నారు.
ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ గుడారు జగదీష్ మాట్లాడుతూ, రేడియేషన్ ఆంకాలజీ రంగంలో 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డా॥ కిరణ్ కుమార్ వంటి ప్రముఖ వైద్య నిపుణులు శ్రీవారి వైద్యసేవలో భాగంగా స్విమ్స్‌కు విజిటింగ్ ఫ్యాకల్టీగా రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
“అత్యున్నత నైపుణ్యం, సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్య నిపుణుల సేవలను సామాన్య, పేద మరియు నిరుపేద రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది శ్రీవారి వైద్యసేవ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. డా॥ కిరణ్ కుమార్ గారి అపారమైన అనుభవం క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడంలోనే కాకుండా, స్విమ్స్‌లోని యువ వైద్యులకు, పీజీ విద్యార్థులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది” అని డా॥ గుడారు జగదీష్ తెలిపారు.
డా॥ కిరణ్ కుమార్ తన పర్యటనలో ఓపీ సేవలు, ఇన్‌పేషెంట్ కన్సల్టేషన్లు, క్లిష్టమైన క్యాన్సర్ కేసులపై నిపుణుల సలహాలు, రేడియేషన్ చికిత్స ప్రణాళికపై మార్గదర్శకత్వం అందించడంతో పాటు, పీజీ వైద్య విద్యార్థులకు ప్రత్యేక బోధన కార్యక్రమాలు నిర్వహించి తన అనుభవాన్ని పంచుకోనున్నారని తెలిపారు.
రేడియేషన్ ఆంకాలజీ చికిత్స అవసరమైన రోగులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డా॥ కిరణ్ కుమార్ గారి నిపుణుల వైద్య సేవలను పొందాలని డా॥ గుడారు జగదీష్ కోరారు.
ఈ సందర్భంగా డా॥ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, “కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, శ్రీవారి వైద్యసేవలో భాగంగా స్విమ్స్‌లో క్యాన్సర్ రోగులకు సేవలందించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అవసరమైన రోగులకు నా వైద్య పరిజ్ఞానం, అనుభవం ద్వారా సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తోంది. ఈ మహత్తర సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులను శ్రీవారి వైద్యసేవ ద్వారా స్విమ్స్‌కు ఆహ్వానించి, వారి విశేష నైపుణ్యం మరియు అనుభవాన్ని రోగుల చికిత్సతో పాటు వైద్య విద్య, శిక్షణకు వినియోగించడం ద్వారా స్విమ్స్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డా॥ గుడారు జగదీష్ తెలిపారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి
తిరుపతి



