స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ గారు, ముఖ్య అతిథిగా డాక్టర్. ఆశిస్ పాఠక్, డాక్టర్. శిల్పా కడియాల, డాక్టర్.రామ్, డాక్టర్.ఉమామహేశ్వర రావు, డాక్టర్.బి. సి.యం.ప్రసాద్, డాక్టర్.రమేశ్ చంద్ర గార్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు.
తిరుపతి స్విమ్స్‌లో న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో 7వ శ్రీనివాస్ న్యూరోసర్జరీ ఎండోమెంట్ ఒరేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోర్టిస్ హాస్పిటల్, మొహాలీ డైరెక్టర్ ఆఫ్ న్యూరోసర్జరీ డా. ఆశిష్ పాఠక్ “Mystery of Spontaneous Subarachnoid Hemorrhage” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం అందించారు.
“స్విమ్స్‌లో అత్యున్నత వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి.. అత్యాధునిక చికిత్స సామాన్య ప్రజలకు చేరాలి” అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డా. గుడారు జగదీష్ తెలిపారు.
ఇలాంటి ప్రతిష్టాత్మక వైద్య కార్యక్రమాలు స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వైద్య విద్య, పరిశోధన మరియు రోగుల అత్యాధునిక చికిత్సకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఆకస్మిక తీవ్రమైన తలనొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు
డా. ఆశిష్ పాఠక్ మాట్లాడుతూ, Spontaneous Subarachnoid Hemorrhage (SAH) అనేది అత్యంత తీవ్రమైన న్యూరోసర్జికల్ అత్యవసర పరిస్థితుల్లో ఒకటని తెలిపారు. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన తలనొప్పి, వాంతులు, స్పృహలో మార్పులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
సకాలంలో నిర్ధారణ, రోగిని స్థిరీకరించడం, రక్తస్రావానికి కారణాన్ని గుర్తించడం, అవసరమైనప్పుడు తగిన న్యూరోసర్జికల్ లేదా ఎండోవాస్క్యులర్ చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడే అవకాశం మెరుగుపడుతుందని వివరించారు.
వారు వస్తారు.. మనం వింటాం.. మన జ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటాం.. ఆ జ్ఞానం మన భవిష్యత్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది” అని డా. జగదీష్ అన్నారు.
1992-93 నుంచే న్యూరోసర్జరీతో అనుబంధం
స్విమ్స్ న్యూరో సర్జరీ పితామహాడు డాక్టర్. బి. సి.యం ప్రసాద్ అని కొనియాడారు.
న్యూరోసర్జరీ విభాగంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న డా. జగదీష్, 1992-93 సంవత్సరాల నుంచే స్విమ్స్‌లో న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాలతో కలిసి పాలీట్రామా కేసులకు టీమ్‌వర్క్‌తో చికిత్స అందించేవారమని తెలిపారు. ఒక క్లిష్టమైన పాలీట్రామా కేసులో తాను హిప్ ఫ్రాక్చర్‌కు శస్త్రచికిత్స చేస్తుండగా, న్యూరోసర్జన్ అదే సమయంలో పుర్రెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
“ఇలాంటి సవాళ్లతో కూడిన పాలీట్రామా కేసులను స్విమ్స్ వైద్య బృందం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించింది” అని డా. జగదీష్ పేర్కొన్నారు.
వైద్యానికి హద్దులు లేవు.. సేవకు సరిహద్దులు లేవు
పశ్చిమ బెంగాల్‌తో తనకున్న అనుబంధాన్ని కూడా డా. జగదీష్ గుర్తుచేశారు. 1992 నుంచి టోలీగంజ్‌లోని వెస్ట్ సౌత్హోపతి హాస్పిటల్లో సుమారు 22 ఉచిత శస్త్రచికిత్సా శిబిరాల్లో పాల్గొని, 13,000 మందికి పైగా చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు అందించిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.
వైద్య వృత్తి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, సమాజంలోని అవసరమైన వారికి సేవ చేయడమే వైద్యుల అసలైన బాధ్యత అనే సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా చాటిచెప్పారు.
స్పైన్ వైద్యంలో సమన్వయం ఎంతో ముఖ్యం స్పైన్ చికిత్సలో ఆర్థోపెడిక్ సర్జన్లు, న్యూరోసర్జన్ల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని డా. జగదీష్ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో స్పైన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పిల్లలు, పెద్దలకు సంబంధించిన స్పైన్ సమస్యలు, స్పైన్ ట్రామా కేసుల్లో బహుళ విభాగాల సమన్వయంతో చికిత్స అందించడం అత్యంత కీలకమని తెలిపారు.
స్విమ్స్‌లో అత్యుత్తమ స్పైన్ సర్జన్లు, న్యూరోసర్జన్లు అందుబాటులో ఉండటం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఇలాంటి సింపోజియంలే వైద్య పరిజ్ఞానాన్ని మరింత పదును పెడతాయి”
అకడమిక్ సింపోజియంలు, ఎండోమెంట్ ఒరేషన్లు వైద్యుల జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా, కొత్త ఆలోచనలకు, పరిశోధనలకు, భవిష్యత్‌లో మెరుగైన వైద్య సేవలకు మార్గం చూపుతాయని డా. గుడారు జగదీష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ న్యూరో సర్జరీ విభాగం వైద్యులు స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




